Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుహార్డ్‌వేర్ పార్క్ నోటిఫికేషన్ రద్దు చేయాలి:హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ),

హార్డ్‌వేర్ పార్క్ నోటిఫికేషన్ రద్దు చేయాలి:హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ),

📰 Generate e-Paper Clip

23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్):

నాదర్‌గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్క్, వర్క్ సెంటర్ పేరుతో గత 23 ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అఖిలపక్ష సదస్సులో పాల్గొన్న నాయకులు, భూ బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సేకరించని భూములను నోటిఫికేషన్ పరిధి నుంచి తొలగించాలని, నష్టపరిహారం అందని వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించాలని, వేలాది నివాస ప్లాట్లపై ఉన్న ఆంక్షలను తొలగించాలనికోరారు.
హార్డ్‌వేర్ పార్క్ పరిధి నుంచి తమ భూములను తొలగించాలని భూ యజమానులు పోరాడుతున్న నేపథ్యంలో, ఇటీవల ఆయా భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని వక్తలు పేర్కొన్నారు.బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ), తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సదస్సులో వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈటీ నరసింహతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.
ఐక్యంగా పోరాడితేనే సమస్యకు పరిష్కారం:కోదండరాం
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ భూ సమస్య పరిష్కారం కోసం భూ బాధితులు, రైతులు, ప్లాట్ల యజమానులు ఐక్యంగా సమష్టి కార్యాచరణ కొనసాగించాలని అన్నారు. 2004లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై రెండు దశాబ్దాలు దాటినా హార్డ్‌వేర్ పార్క్ కోసం సేకరించిన భూమిపూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని తెలిపారు.
మరోవైపు భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి కొనుగోలు చేసిన వేలాది ప్లాట్ల యజమానులు తమ భూములను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. భూసేకరణ ప్రక్రియ సక్రమంగా జరగలేదని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
ప్రభుత్వం దృష్టికి సమస్య: కోదండరాం
ఈ అంశంపై వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లామని కోదండరాం తెలిపారు. సంబంధిత అధికారులు సమగ్ర వివరాలు, సర్వే నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.ప్రస్తుతం ఈ సమస్య ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకునే కీలక దశకు చేరుకుందని, అందుకే అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ప్రతి లేఅవుట్‌కు సంబంధించిన భూములు, ప్లాట్లు, యజమానుల వివరాలను సేకరించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అందజేయాలని సూచించారు.ఆ వివరాల ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. అవసరమైతే తదుపరి కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.“విడివిడిగా చేసే ప్రయత్నాలతో సమస్య పరిష్కారం కాదు.. ఐక్యంగా కదిలితేనే న్యాయం సాధించగలం. బలహీనుడికి ఆయుధం ఐక్యత” అని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.