Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలు2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీల భర్తీ: సీఎం

2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీల భర్తీ: సీఎం

📰 Generate e-Paper Clip

విడతలవారీగా నియామకాలు.. పోలీసు సంక్షేమానికి పెద్దపీట:సీఎం రేవంత్ రెడ్డి
**హైదరాబాద్, అక్టోబర్ 21 (ప్రజా సంక్షేమం న్యూస్):**
తెలంగాణ పోలీసు శాఖలో సిబ్బంది కొరత లేకుండా 2028 నాటికి అన్ని ఖాళీలను విడతలవారీగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆహార కల్తీ వంటి నూతన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పోలీసు శాఖలో భారీగా నియామకాలు:
2025 అక్టోబర్ నాటికి దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలను నియమించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 2026లో పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని, ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అవకాశాలు కల్పించామని వివరించారు.రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకమని, ప్రజలు నిర్భయంగా జీవించినప్పుడే పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని సీఎం పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
అమరుల కుటుంబాలకు భారీ పరిహారం:
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అందించే ఎక్స్‌గ్రేషియాను పెంచినట్లు సీఎం తెలిపారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు రూ.కోటి వరకు, ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు రూ.1.50 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్ల పరిహారం అందిస్తున్నట్లు వివరించారు.అమరుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఉచిత విద్య, వైద్య సహాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వైద్య విద్యలో ప్రత్యేక సీట్లు అందించడంతో పాటు భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హోంగార్డుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశించారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు:
పోలీసు సిబ్బంది పిల్లల విద్య కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 44 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్ ఫోర్స్, ఆహార కల్తీ నివారణకు టీజీ సేఫ్, మహిళల రక్షణకు షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్, స్పందన బృందాలు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, నేరస్థుల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు.
**“అమరుల కుటుంబాలు ఒంటరివి కావు. ప్రభుత్వం, పోలీసు శాఖ,సమాజం వారికి అండగా ఉంటాయి. అమరుల త్యాగాలను గౌరవిస్తూ,వారి స్ఫూర్తితో శాంతియుతమైన,సురక్షితమైన,అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి”** అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.
**ప్రజా సంక్షేమం న్యూస్**

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.