100 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం.. రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందిస్తాం: పొన్నం ప్రభాకర్
ప్రజాసంక్షేమం న్యూస్ మేడ్చల్–మల్కాజిగిరి: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ బస్ టెర్మినల్‌ను ఆధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించి, రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికులకు సేవలందించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. నిర్మాణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల పేర్లతోనే కొత్త బస్ స్టేషన్‌కు నామకరణం చేస్తామని తెలిపారు.
మహిళలకు ఉచిత ప్రయాణంతో రూ.12,888 కోట్ల ఆదా!మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళలు రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యాలు, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఆర్టీసీకి కొత్త బస్సులు.. ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్య నియంత్రణ
ఇప్పటికే 3,000కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొంటూ, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బస్ టెర్మినల్ నిర్మాణానికి రూ.3.22 కోట్లు కేటాయించిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వజ్రేష్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు.
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం:
RELATED ARTICLES

