చిన్నచిన్న కారణాలతో పేదల దరఖాస్తుల తిరస్కరణ సరికాదు
తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలి..
రామన్నపేట, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్):
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని, చిన్నచిన్న కారణాలు చూపుతూ తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నిర్మలానరసింహా నేత ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల పెన్షన్ దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో తిరస్కరించడం వారిపట్ల తీవ్ర అన్యాయమని అన్నారు.జీవనోపాధి కోసం కొందరు పాత కార్లను కొనుగోలు చేసి రవాణా పనులకు వినియోగిస్తున్నారని, మరికొందరు పాత ట్రాక్టర్లను వ్యవసాయ, ఉపాధి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అలాంటి వాహనాలను విలాసవంతమైన ఆస్తులుగా పరిగణించి పెన్షన్లు నిరాకరించడం సమంజసం కాదన్నారు. చిన్న స్థలం లేదా పాత వాహనం ఉన్నంత మాత్రాన వారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లు భావించకూడదని పేర్కొన్నారు.అధికారులు కేవలం రికార్డులు, నిబంధనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వాస్తవ ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. వారి ఆస్తులు కుటుంబ జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయా, విలాసాల కోసం వినియోగిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
2023 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని 34వ పేజీ, 24వ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్లు అందిస్తామని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రస్తుతం పేదల దరఖాస్తులపై ఆంక్షలు విధించడం, చిన్నచిన్న కారణాలతో తిరస్కరించడం బాధాకరమన్నారు.పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాల పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట టీడీపీ మండల అధ్యక్షులు మీర్జా ఫజల్ బేగ్, సిరిపురం మాజీ సర్పంచ్ రాపోలు నిర్మల, నాయకులు పోచబోయిన మల్లేశం, సిరిపురం చేనేత సహకార సంఘం మాజీ కార్యదర్శి రాపోలు యాదగిరి, వడ్లకొండ సత్తయ్య, గజం నరసింహ, గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

