

విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: ఇకపై ఏటా అడ్వాన్స్‌గానే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు!
* విద్యార్థులు అడగాల్సిన అవసరం లేకుండానే ఖాతాల్లోకి డబ్బులు
* ఏటా రూ. 2,400 కోట్లతో పారదర్శకంగా పథకం అమలు
* నెక్లెస్ రోడ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ
* సాంకేతిక నైపుణ్యాలు (Skills), క్రీడల్లో రాణించాలని సీఎం పిలుపు
హైదరాబాద్ (ప్రజా సంక్షేమం):
రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గానే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వి. హనుమంతరావు, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తదితర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
* అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్: “ఫీజులు కట్టలేదని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడగకుండానే వారి ఖాతాల్లో ముందస్తుగా డబ్బులు వేస్తాం. వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు జమ చేసి పారదర్శకంగా అమలు చేస్తాం.”
* డిగ్రీలు కాదు.. స్కిల్స్ ముఖ్యం: “కేవలం సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఐటీ రంగంలో మార్పులు వస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ ద్వారా యువతను గ్లోబల్ స్థాయికి సిద్ధం చేస్తున్నాం. నర్సింగ్ చదివిన ఆడపిల్లలకు విదేశాల్లో రూ. 2 లక్షలకు పైగా వేతనాలతో ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి.”
* క్రీడాకారులకు కొలువులు & నజరానాలు: “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రానికి, దేశానికి మెడల్స్ సాధించి గౌరవం తీసుకురండి.. ఒలింపిక్స్‌లో రాణించండి.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కోటి రూపాయల వరకు నగదు బహుమతులు ఇచ్చే బాధ్యత నాది.”
* సామాజిక సమానత్వం – ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: “కులాల మధ్య అంతరాలు తగ్గించి, అన్ని వర్గాలు కలిసి చదువుకునేలా రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ విధానాన్ని తీసుకొస్తున్నాం.”
* మహనీయుల స్ఫూర్తి: “పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కేవలం జయంతులు, వర్ధంతుల కోసమే కాదు.. వారి త్యాగాలు, ఆశయాల నుంచి నేటి తరం స్ఫూర్తి పొంది సమాజ వికాసానికి కృషి చేయాలి.”

