Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణక్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

క్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

📰 Generate e-Paper Clip

పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం!
క్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలకు ఆహ్వానం!
2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌, 8,000 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్‌ లక్ష్యం!

ప్రజా సంక్షేమ న్యూస్ హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్‌ ఎనర్జీ తయారీ రంగంలో ప్రపంచస్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌, నోవాటెల్‌లో నిర్వహించిన రెండు రోజుల *‘ఇండియా ఎనర్జీ సమ్మిట్‌ & ఎక్స్‌పో–2026’*ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సీఈఓలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రకాల పెట్టుబడులను ప్రోత్సహించే రాష్ట్రంగా ఉందని, పెట్టుబడిదారులకు ఇది నిజమైన స్వర్గధామమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంపదలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన ఆహ్వానం పలికారు.
ఇంధన మార్పు అనేది కేవలం విద్యుత్‌ ఉత్పత్తి వనరులను మార్చడం మాత్రమే కాదని, మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రక్రియ అని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణను కేవలం క్లీన్‌ ఎనర్జీ వినియోగదారుగా కాకుండా, క్లీన్‌ ఎనర్జీ సాంకేతికతల తయారీలో ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌:
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు, 2035 నాటికి 26,000 మెగావాట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 2030 నాటికి 3,800 మెగావాట్ల, 2035 నాటికి 8,000 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఏఐ డేటా సెంటర్లకు పునరుత్పాదక విద్యుత్‌:
హైదరాబాద్‌ ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో ఉన్న బలాన్ని వినియోగించుకుని భవిష్యత్‌ పవర్‌ గ్రిడ్‌ను డిజిటల్‌ నెట్‌వర్క్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతిపాదిత *‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’*లో ఏర్పాటు కానున్న ఏఐ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ అందించేందుకు ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందన్నారు.
గ్రీన్‌ హైడ్రోజన్‌, ఈవీ రంగాలకు ప్రాధాన్యం:
2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. 2035 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,000 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.తెలంగాణలో సోలార్‌, విండ్‌, బ్యాటరీ పరికరాల తయారీ సంస్థలకు మూలధన ప్రోత్సాహకాలు, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ సుంకం మినహాయింపులు అందించడంతో పాటు TG-iPASS ద్వారా వేగవంతమైన అనుమతులు కల్పిస్తామని తెలిపారు.ప్రభుత్వం–ప్రైవేటు రంగం బలమైన భాగస్వామ్యంతోనే ఈ ఇంధన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్న డిప్యూటీ సీఎం.. తెలంగాణతో కలిసి క్లీన్‌ ఎనర్జీ రంగంలో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమం అనంతరం భట్టి విక్రమార్క ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. ఎనర్జీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.