తెలంగాణ రాష్ట్రానికి రైల్వే అనేక వరాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన అదనపు లైన్ల ఏర్పాటుతోపాటు, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, అవసరమైన చోట అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది. రూ.2864 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం మీదుగా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాండురంగాపురం, భద్రాచలం, మల్కన్ గిరి, నూతన రైల్వే ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది. కేంద్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా దీనిని ప్రకటించింది. ఈ మార్గాన్ని 2864 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలిసారిగా భద్రాచలాన్ని రైల్వే మ్యాప్ లోకి తీసుకురావడం ఎంతోకాలంగా భద్రాచల పుణ్యక్షేత్రానికి వస్తున్న లక్షలాదిమంది భక్తులకు సంతోషాన్ని కలిగిస్తున్న అంశం.
తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో భద్రాద్రి రామయ్య చెంతకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి ఆలయానికి వెళ్లేందుకు రైల్వే సౌకర్యం ఉంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఆలయానికి వెళ్లి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే నిర్మిస్తున్న ఈ కొత్త లైన్ భద్రాచలానికి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఖర్చు, సమయాన్ని ఆదా చేసే గొప్ప మార్గం. ఇక ఈ ప్రాజెక్టును ప్రయాణికుల భద్రత, గరిష్ట వేగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పాండురంగాపురం, భద్రాచలం, ఏపీ మీదుగా ఒడిశాలోని మల్కన్ గిరి ఈ రైల్వే ట్రాక్ భవిష్యత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైళ్లు తిరిగేలా రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గుండా ప్రయాణం చేసి ఆపై ఒడిస్సా లోని పలు జిల్లాలను కలుపుతూ మల్కన్ గిరి వరకు ఈ రైలు మార్గం సాగుతుంది.


