Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

📰 Generate e-Paper Clip

పేదల కన్నీటికి విలువ కట్టలేం.. సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం
హైదరాబాద్‌లో పేదల కోసం జీప్లస్‌10 అంతస్తుల ఇందిరమ్మ టవర్స్‌
డ్రాలో 480 మంది లబ్ధిదారుల ఎంపిక.. మిగిలిన వారికి తదుపరి విడతల్లో ఇళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్):

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడు జీవితంలో ఒక్కసారైనా సొంతింటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు.నాంపల్లి శాసనసభ నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మంత్రి అజారుద్దీన్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌,ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు.మహానగరంలో ఎకరం భూమి విలువ రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నప్పటికీ, ఆ భూమి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కంటే పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన భూములను గుర్తించి హౌసింగ్‌ శాఖకు బదలాయించి పేదల కోసం జీప్లస్‌10 అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
డ్రాలో 480 మంది ఎంపిక:పారదర్శకంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన అర్హులకు రెండో,మూడో,నాలుగో విడతల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.హైదరాబాద్‌ పరిధిలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, సుమారు 16–17 ప్రాంతాల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఏడాదిలోపే ఇంటి తాళాలు:ఇందిరమ్మ టవర్స్‌లో ఒక్కో అపార్ట్‌మెంట్‌ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని మంత్రి తెలిపారు.రెండు, మూడు సంవత్సరాలు ఆలస్యం చేయకుండా ఒక ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తామని హామీ ఇచ్చారు.గతంలో మాదిరిగా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయకుండా,లబ్ధిదారుల పేర్లపై ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలు వంటి అవసరాలకు రుణం పొందే అవకాశం ఉండేలా చర్యలు చేపడతామని చెప్పారు.
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం:ఇందిరమ్మ టవర్స్‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని డ్రైనేజీని మెయిన్‌ ట్రంక్‌ లైన్‌కు అనుసంధానం చేసే బాధ్యతను హౌసింగ్‌ శాఖ తీసుకుంటుందని తెలిపారు.నిర్మాణ పనుల్లో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారిస్తామని చెప్పారు. వారానికి ఒక రోజు లబ్ధిదారులు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి తమ ఇళ్ల నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించం:పేదలు నివసించే ప్రాంతాలకు 30–40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల గతంలో జీవనోపాధి,పిల్లల చదువులు, కుటుంబ అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి పేర్కొన్నారు.అందుకే పేదల జీవనోపాధి, పిల్లల విద్య, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర పరిధిలోనే ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.“ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ప్రతి తండాలో,ప్రతి గూడెంలో,ప్రతి డివిజన్‌లో, ప్రతి వార్డులో పేదలకు ఇళ్లు నిర్మించి చూపిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే ప్రజా ప్రభుత్వం తొలి విడతలోనే రెట్టింపు ఇళ్లు నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.లక్కీ డ్రాలో విజేతలైన లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల నంబర్లను కేటాయిస్తూ పేర్లను ప్రకటించారు.ఇందులో భాగంగా మాదేసు లతకు ఇందిరమ్మ-ఎ టవర్‌లోని 801వ ఇంటిని మంత్రి కేటాయించారు.కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్‌, కలెక్టర్‌ ప్రియాంక అల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.