Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించాలి

ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా సంక్షేమం న్యూస్ | హైదరాబాద్

తెలంగాణను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక ప్రాజెక్టులు,శాఖ ఆస్తులు,ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ,పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ బ్రాండ్‌కు గ్లోబల్ గుర్తింపు:
పర్యాటక అభివృద్ధి అంటే కేవలం పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం మాత్రమే కాదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర,సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘తెలంగాణ బ్రాండ్‌’ను బలోపేతం చేయాలని సూచించారు.
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు:ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో కొత్త పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖకు చెందిన భవనాలు,ఖాళీ స్థలాలు, అభివృద్ధికి అనువైన ఇతర ఆస్తులను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని సూచించారు.శాఖ ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే PPP ప్రాజెక్టులకు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది.
టెంపుల్,ఎకో,హిల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి:
రాష్ట్రంలోని టెంపుల్ టూరిజం,ఎకో టూరిజం,హిల్ టూరిజం,హెరిటేజ్ టూరిజం ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.హైదరాబాద్‌కు వచ్చే దేశీయ,విదేశీ పర్యాటకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను సందర్శించేలా ప్రత్యేక టూరిజం సర్క్యూట్లను రూపొందించాలని చెప్పారు. తెలంగాణ టూరిజం అధికారిక పోర్టల్‌లో ప్రస్తుతం ఆలయ పర్యటనలు,ఎకో టూరిజం, హెరిటేజ్ ప్రాంతాలు,వివిధ టూర్ ప్యాకేజీలకు ప్రాధాన్యం ఇస్తోంది.
చారిత్రక కట్టడాల పరిరక్షణ:
తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతలో కీలక భాగమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రామప్ప వంటి చారిత్రక ప్రాంతాల్లో పరిరక్షణ, నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యార్థులకు ‘తెలంగాణ దర్శిని’:
విద్యార్థులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పించేందుకు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సమావేశంలో సూచించారు. విద్యార్థులను చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర వారసత్వంపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు.
పెట్టుబడులు.. ఉపాధి.. ఆదాయానికి పర్యాటకం:
పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.“తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. పర్యాటకం ద్వారా పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచాలి. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.