బాగ్ లింగంపల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కుల పంపిణీ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ అనేక ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో కష్టపడి జీవించే పేద, సామాన్య ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే స్ట్రీట్ వెండర్స్ ఎగ్స్ షాప్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.
మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు
మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు ఉన్న వడ్డీలేని రుణ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందని మంత్రి తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వడ్డీలేని రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, బస్సులు, ఇతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులను మహిళలకు యాజమాన్య అవకాశాలతో అందించినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఈ అవకాశాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బీసీ, మైనారిటీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్లు, శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు.
రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లి వార్డు నంబర్ 163లో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో SWD డ్రెయిన్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక సాధికారత కుటుంబ సాధికారతకు,తద్వారా సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
RELATED ARTICLES

