అక్టోబర్ 31లోగా కరువు ప్రభావిత మండలాల గుర్తింపు పూర్తి చేయాలి
త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం
హైదరాబాద్,ప్రజా సంక్షేమం న్యూస్:
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే అవకాశమున్న కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కరువు పరిస్థితులపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ తొలి సమావేశంలో నిర్ణయించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు, రైతులకు సహాయం, విద్యుత్ సరఫరా, గ్రామీణ ఉపాధి తదితర అంశాలపై సమీక్షించారు.
358 మండలాల్లో కరువు పరిస్థితులపై ప్రాథమిక అంచనా!
రాష్ట్రంలో 358 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శాస్త్రీయ ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల ఆధారంగా అర్హత కలిగిన మండలాలను గుర్తించి, అక్టోబర్ 31లోగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
తాగునీరు,సాగునీరు,విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి:అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని ఆదేశించారు.విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని, అత్యవసర అవసరాలకు ఆర్థిక శాఖ సహకారం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పశువులకు నీరు, ఉపాధి అవకాశాలు, అత్యవసర సహాయక చర్యలపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు.సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎల్‌నినో,కరువు పరిస్థితులపై ముందస్తు కార్యాచరణ: డిప్యూటీ సీఎం
RELATED ARTICLES

