Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి: CM

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి: CM

📰 Generate e-Paper Clip

152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
**హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్):**
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న చర్చలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో, అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం తదితర వివరాలను సిద్ధం చేయాలని సూచించారు.
152 మీటర్ల ఎత్తుతో అధిక నీటి వినియోగమే లక్ష్యం:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై చర్చించారు.తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాలు, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే వెయ్యి ఎకరాల్లోపు భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఇంజనీర్లు వివరించారు. మహారాష్ట్ర పరిధిలో గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని తెలిపారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించినప్పటికీ, ఆ ఎత్తుతో ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కాదని సీఎం పేర్కొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునేలా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.
## ఆదిలాబాద్ ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు:అటవీ, గిరిజన ప్రాంతాలతో పాటు అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన అటవీ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు.బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గాల రూపకల్పన, భూసేకరణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జల సంఘం సమావేశాల్లో చర్చించిన అంశాలు, కోరిన నివేదికలను వెంటనే సమర్పించాలని, మహారాష్ట్రతో చర్చల్లో తెలంగాణ నీటి అవసరాలను సమర్థంగా వివరించాలని మంత్రులకు సూచించారు.
## డిండి,అచ్చంపేటకు అదనంగా 0.6 టీఎంసీల నీరు:డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీ నీటిని అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన అదనపు 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి సమకూర్చుకునేలా ప్రత్యేక లిఫ్టింగ్ వ్యవస్థను రూపొందించాలని సూచించారు.శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు అవసరమైన పంపులు, పంప్‌హౌస్‌ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్వలు, సొరంగాల సామర్థ్యంపై అధ్యయనం చేసి తగిన డిజైన్లు సిద్ధం చేయాలన్నారు.డిండికి నార్లాపూర్ నుంచి నీటిని తీసుకురావాలా, ఏదుల నుంచి తరలించాలా అనే అంశంపై మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సమావేశంలో పరిశీలించారు. రెండు మార్గాల అంచనా వ్యయాలు, అనుకూలతలు, ప్రతికూలతలను అధికారులు వివరించారు.పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలు, కేటాయింపులకు ఎలాంటి ఆటంకం కలగకుండా డిండి, అచ్చంపేటకు అదనపు నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు మంత్రులు మద్దతు తెలిపారు.
**ప్రజా సంక్షేమం న్యూస్ | తెలంగాణ ప్రజల కోసం ప్రజా వార్తలు**

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.