సాంస్కృతిక సారథిలో మరింత మందికి ఉద్యోగావకాశాలపై ప్రభుత్వ పరిశీలన
కళాకారుల వేతనాలు రూ.31,868కి పెంపు.. ప్రతి నెల 1న జీతాల చెల్లింపు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు కళాకారులు పోషించిన పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాకారులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు.కళాకారులంటే తనకు ఎంతో గౌరవం ఉందని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. మరింత మంది కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగావకాశాలు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు.ఇటీవల కొందరు కళాకారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. తాను అందుబాటులో లేకపోవడంతో వారితో మాట్లాడి మరుసటి రోజు కలుస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. అప్పటివరకు పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో వారికి వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం రవీంద్రభారతిలో కళాకారులతో సమావేశమై వారి సమస్యలను సావధానంగా విన్నానని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అయితే కొంతమంది కళాకారులు తన వాహనాన్ని అడ్డుకున్నారని, వారిని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. ఆందోళన చేసిన కళాకారులను పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, కళాకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్ల పాలనలో సాంస్కృతిక సారథి కళాకారులకు సకాలంలో వేతనాలు చెల్లించలేదని, మూడు నుంచి ఆరు నెలల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రం కళాకారుల సంక్షేమాన్ని విస్తృత దృక్పథంతో చూస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలను రూ.24,514 నుంచి రూ.31,868కు పెంచిందని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు.
కళాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలల వరకు మెడికల్ లీవ్‌లు మంజూరు చేస్తున్నామని, మహిళా కళాకారుల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డప్పు, కీబోర్డు వంటి కళల్లో శిక్షణ ఇస్తున్నామని, త్వరలో యాంకరింగ్, నాటకాల ప్రదర్శనలోనూ శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా 10,500 మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కళాకారుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి : జూపల్లి కృష్ణారావు
RELATED ARTICLES

