ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 1: కరువు పరిస్థితులపై కేబినెట్ దృష్టి:రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఈ వానాకాలంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. సుమారు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణ ఉపశమన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీలో చర్చించాలని నిర్ణయించింది.త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. కరువు మండలాలను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించనుంది.
65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు:ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని సివిల్ సప్లయిస్ శాఖ అంచనా వేసింది.కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
విద్యుత్తు డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి:ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సాధారణంగా రోజువారీ విద్యుత్తు వినియోగం సుమారు 15,000 మెగావాట్లు ఉండగా, ఈ సీజన్‌లో పీక్ డిమాండ్ రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు చేరింది. గత ఏడాది గరిష్ట డిమాండ్ 16,613 మెగావాట్లుగా నమోదైంది.భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోతలు లేకుండా అవసరమైన విద్యుత్తును సమకూర్చుకోవడంతో పాటు డిమాండ్ మేరకు విద్యుత్తును కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
7,800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు:భవిష్యత్ విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది.ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్లు ఉన్నాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది.
కోహెడలో వరల్డ్ క్లాస్ ఫ్రూట్ మార్కెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రతిపాదించిన వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మార్కెట్‌ను పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని సూచించింది.
10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులకు బ్రేక్:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది.ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ:తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఈ పాలసీని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ భవన్‌లో డిప్యూటీ కమిషనర్ పోస్టు:న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధులు నిర్వహించేందుకు మరో నలుగురు గ్రూప్–1 అధికారులను నియమించాలని నిర్ణయించింది.
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు:
RELATED ARTICLES

