Wednesday, November 11, 2026
prajasamkshemam news
HomeUncategorizedఅక్రమ ఐవీఎఫ్ కేంద్రాలపై ఉక్కుపాదం:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

అక్రమ ఐవీఎఫ్ కేంద్రాలపై ఉక్కుపాదం:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

📰 Generate e-Paper Clip

అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేయాలి
అక్రమాలకు పాల్పడిన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలి:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్
:రాష్ట్రంలో ఐవీఎఫ్ (IVF) కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, రోగుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిందని, తాజాగా అండాల అక్రమ సేకరణకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పట్టుకున్నామని మంత్రి తెలిపారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యశాఖ అధికారులు నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.ఈ మేరకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. అక్రమ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర విచారణ జరిపి, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తులో పోలీస్ శాఖకు ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.అక్రమాలకు పాల్పడిన వైద్యులపై చర్యల విషయంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
సరోగసీ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయాలని మంత్రి సూచించారు. ఈ చట్టాల అమలులో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.కేంద్ర చట్టాల పరిధిలోనే రాష్ట్ర స్థాయిలో అదనపు నియంత్రణ చర్యలు, మార్గదర్శకాలు రూపొందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.