Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeజాతీయంకృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించాలి: సీఎం

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించాలి: సీఎం

📰 Generate e-Paper Clip

సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జలవివాదాలకు సంబంధించిన అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించారు.
డిండి,అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి:డిండి,అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి ఈ రెండు పథకాలకు నీటిని అందించాలని స్పష్టం చేశారు. అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఎక్కడ టన్నెల్ నిర్మించాలి, ఎక్కడ కాలువలు ఏర్పాటు చేయాలనే అంశాలను గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని సూచించారు.
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల్లో తొందరపాటు వద్దు:కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితుల నేపథ్యంలో అదనపు టీఎంసీ పనులపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, అనంతరం భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు.
అన్ని అనుమతులు, డీపీఆర్ సిద్ధం చేయాలి:కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.