కొడంగల్ భూములకు 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు – మాటిచ్చిన ముఖ్యమంత్రి
రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
వచ్చే సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబలం కార్యక్రమం
ప్రజాసంక్షేమం న్యూస్ కొడంగల్:గత ప్రభుత్వం చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే, మరోవైపు ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో నిర్వహించిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకుముందు పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా తీవ్ర అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరువు కాటకాలు, వలసలతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతోమంది నాయకులు అధికారంలోకి వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని, రైతులకు సాగునీరు అందలేదని పేర్కొన్నారు.భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా ఆశించిన పురోగతిని సాధించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదేళ్లపాటు పక్కన పెట్టారని ఆరోపించారు.
2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు..
2028 డిసెంబర్ నాటికి కృష్ణానది జలాలతో కొడంగల్ ప్రాంతంలోని భూములను తడిపి పచ్చని పంటలు పండించేలా చేయడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు.కొడంగల్ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాజేంద్రనగర్ నుంచి చేవెళ్ల, షాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల వరకు రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని వివరించారు.
ఎల్‌నినోపై రైతులు అప్రమత్తంగా ఉండాలి…
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి, తక్కువ నీటితో పండించే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందరం కలిసికట్టుగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాబలం’ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సన్నబియ్యం విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక సీజన్లో వరి పంట సాగు కాకపోయినా ప్రజలకు సరిపడా బియ్యం నిల్వలు ప్రభుత్వ వద్ద ఉన్నాయని భరోసా ఇచ్చారు.ఈ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వ అప్పులు చెల్లిస్తూనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
RELATED ARTICLES

