Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుసీఎం సభకు సిద్ధిపేట ప్రజల భారీ స్పందనతో హరీష్ రావులో ఆందోళన

సీఎం సభకు సిద్ధిపేట ప్రజల భారీ స్పందనతో హరీష్ రావులో ఆందోళన

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.. హరీష్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
హైదరాబాద్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్):

సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావులో ఆందోళన మొదలైందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందని, ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్, వీర్లపాటి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ సిద్ధిపేట నియోజకవర్గం నుంచే సుమారు 40 వేల మంది సీఎం సభకు హాజరయ్యారని తెలిపారు. సిద్ధిపేటలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో పాటు రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తన అడ్డా, గడ్డగా చెప్పుకునే సిద్ధిపేటలోనే ముఖ్యమంత్రి గత రాజకీయ వ్యవహారాలను ప్రజల ముందు ప్రస్తావించడంతో హరీష్ రావు ఇబ్బందికి గురవుతున్నారని విమర్శించారు.బీజేపీతో చర్చలు జరిపారా లేదా అన్న అంశంపై సిద్ధిపేట ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేయాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారని, హరీష్ రావు ముందుగా ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి తన నిజాయితీ నిరూపించుకోవాలని వీరేశం డిమాండ్ చేశారు. సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాత విషయాలను ప్రస్తావిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం:పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు, కృష్ణా జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేసిందని వీరేశం ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ప్రశ్నించారు. జీవో 203 ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు జరిగిన సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.రాయలసీమకు నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నారని, తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు తెలంగాణ నీటి వాటా పెంపు కోసం బలంగా వాదనలు వినిపిస్తోందని తెలిపారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలకు సమాధానం చెప్పాలి!
తెలంగాణ ఉద్యమ సమయంలో టాడా కేసుల్లో జైలుకు వెళ్లిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారని వీరేశం తెలిపారు. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి ఎదుర్కొన్న బాధను కూడా సీఎం ప్రజల ముందుకు తీసుకువచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1,200 మంది అమరవీరుల త్యాగాలకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణను గత పాలకులు ఏ విధంగా దోచుకున్నారో లెక్కలతో సహా అసెంబ్లీలో చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, అసెంబ్లీ వేదికగా చర్చించకుండా బయట విమర్శలు చేయడం సరికాదన్నారు. మాటల గారడీతో ఒక తరాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు.
సంక్షేమ పథకాల అమలుపై గత పాలకులను నిలదీత!
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేసీఆర్ కిట్ పథకంలో ఒక్కో కిట్‌కు రూ.2,800 వరకు అక్రమంగా డ్రా చేశారని ఆరోపించడంతో పాటు గొర్రెల పంపిణీ పథకంలోనూ అవినీతి జరిగిందని పేర్కొన్నారు.పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే, గత పాలకులు తమ హయాంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత తానే కీలక నాయకుడినని హరీష్ రావు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని వీరేశం వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కొందరు నాయకులు ఇప్పుడు ఆయనను సమర్థిస్తూ మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు హరీష్ రావు వాస్తవాలను గుర్తుంచుకోవాలని సూచించారు.తెలంగాణలోని సకల జనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా ఉన్నారని, గత ఎంపీ, సర్పంచ్, మున్సిపల్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ప్రజల మద్దతును ప్రతిబింబిస్తున్నాయని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.