Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా.. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా.. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి: ముఖ్యమంత్రి

📰 Generate e-Paper Clip

చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు.. మరింత విస్తరణకు ఆదేశాలు
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై ప్రణాళికలు
హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన, చెత్తరహిత నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
శుద్ధి చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలి:
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ తదితర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ప్రారంభించిన గ్రీన్ ట్యాంకర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రజల్లో, సంబంధిత వర్గాల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.నిర్మాణ రంగం, గ్రీనరీ నిర్వహణ, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని వినియోగించడం వల్ల విలువైన నీరు వృథా అవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని తెలిపారు.జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సేవలను జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లో మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు:
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగించేలా రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు హెచ్‌ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.