Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుహైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల భాగస్వామ్యం కీలకం! సీఎం

హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల భాగస్వామ్యం కీలకం! సీఎం

📰 Generate e-Paper Clip

మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
సదర్ సమ్మేళన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యాదవ సోదర సోదరీమణులు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌ను దేశంలోనే ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని యాదవ సోదరులకు సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల కృషి, సేవలు ఎంతో కీలకమని కొనియాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలను ఆదరించి, అక్కున చేర్చుకోవడంలో యాదవులు చూపుతున్న ఆత్మీయత అభినందనీయమన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ వారి పాత్ర ఉందని పేర్కొన్నారు.
యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసిందని వెల్లడించారు.తెలంగాణలో తొలిసారిగా కులగణన చేపట్టి దేశానికి మార్గదర్శకంగా నిలిచామని సీఎం అన్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో కులగణన నిర్వహించినట్లు వివరించారు. యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామని తెలిపారు.ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించడంతో పాటు గోశాల బాధ్యతలను కూడా అప్పగించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి యాదవ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై సదర్ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ధర్మేంద్ర యాదవ్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.