Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణహైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు:

హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు:

📰 Generate e-Paper Clip

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం:ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికుల కోసం ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమోరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హమిల్టన్,బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులతో పాటు సుమారు 30 మంది యూకే విశ్వవిద్యాలయాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన తదితర రంగాల్లో ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.MIT, Purdue వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాయని సీఎం తెలిపారు. విదేశీ విద్యాసంస్థల రాకతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.యువతకు అంతర్జాతీయ అవకాశాలను అందించేందుకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.భారత్ ఫ్యూచర్ సిటీని సుమారు 30,000 ఎకరాల్లో నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
డిసెంబర్‌లో నిర్వహించనున్న Invest Telangana Global Summit 2026లో పాల్గొనాలని యూకే విద్యా రంగ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, ఫార్చూన్-500 సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.