Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుపట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

📰 Generate e-Paper Clip

రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన..
ఖరీదైన ప్రాంతాల్లోనే పేదలకు సొంత ఇళ్లు..
ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు…
పైరవీలకు తావులేదు..
లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్‌:
పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్‌,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా, ఖరీదైన ప్రాంతాల్లోనే గౌరవంగా నివసించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
పేదవాడి ఆత్మగౌరవమే లక్ష్యం:
ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు, పైకప్పు కాదని.. పేదవాడికి ఆత్మగౌరవంతో జీవించే చిరునామా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ భారీగా ఉన్న ప్రాంతాల్లోనే పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్‌ షేర్‌తో పాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సేల్‌ డీడ్‌ను రిజిస్ట్రేషన్‌ చార్జీలు లేకుండా అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పైరవీలకు తావులేదు:
లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని పొంగులేటి స్పష్టం చేశారు. అర్హత ఆధారంగా లాటరీ విధానంలో పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. అభ్యంతరాలు స్వీకరించే విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు.తొలి విడతగా ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, పలుచోట్ల ఇప్పటికే టెండర్లు, అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు:
గ్రామీణ ప్రాంతాల్లో తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్స్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి పేద కుటుంబం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెండో, మూడో, నాలుగో, ఐదో విడతల్లోనూ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండున్నరేళ్లలో ‘క్యూర్‌’ ప్రాంతంలోని అర్హులైన పేదలకు దశలవారీగా ఇళ్లు అందిస్తామని తెలిపారు.
వచ్చే బోనాల నాటికి పనులు పూర్తి:
ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే లబ్ధిదారులతో బోనాలు ఎత్తించేలా పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.లబ్ధిదారులు నిర్మాణ పనులను తరచూ పరిశీలించాలని, నాణ్యతలో లోపాలు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ఇళ్లు ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదని, పిల్లలకు, భవిష్యత్‌ తరాలకు మిగిలే ఆస్తి అని మంత్రి పేర్కొన్నారు.గతంలో నగరానికి 30–40 కిలోమీటర్ల దూరంలో పేదల కోసం ఇళ్లు నిర్మించిన విధానానికి భిన్నంగా, హైదరాబాద్‌ నగరంలోనే పేదలకు సొంత ఇళ్లు కల్పిస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.