భూసేకరణ పరిహారం పంపిణీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..
కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి..
సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.6 వేల కోట్ల నిధులు..
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:భూసేకరణ,పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (R&R) కింద ఇప్పటికే విడుదలైన నిధులు భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు.ప్రభుత్వ ఖాతాల్లో నిధులు నిలిచిపోకుండా,పరిహారం చెల్లింపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సూచించారు.
జిల్లా కలెక్టర్లు,నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూసేకరణ,పరిహారం పంపిణీపై మంత్రి సమీక్షించారు.ప్రస్తుతం కలెక్టర్లు,ఆర్డీవోలు,ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ల వద్ద సుమారు రూ.813 కోట్ల నిధులు పంపిణీకి పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇందులో రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద,రూ.311 కోట్లు కలెక్టర్ల వద్ద ఉన్నాయని వివరించారు.ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా,దాదాపు రూ.2,504 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన,మానవీయ దృక్పథంతో పరిహారం అందించాలని ఉత్తమ్ సూచించారు.అవార్డులు పూర్తయిన తర్వాతే చెల్లింపులకు టోకెన్లు జారీ చేయాలని,చెల్లింపు సాధ్యం కాని సందర్భాల్లో కారణాలను వెల్లడించి నిధులను వెనక్కి పంపాలని ఆదేశించారు.
కోర్టు లేదా హక్కుల వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సిద్ధం చేసి,అడ్వకేట్ జనరల్‌తో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
నల్లగొండ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
నల్లగొండ జిల్లాలో చింతపల్లి రిజర్వాయర్,పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిని మంత్రి సమీక్షించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయ్యే సమయానికి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణ కూడా పూర్తి కావాలని స్పష్టం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేందుకు 2026లో భూసేకరణ,R&R,అటవీ సంబంధిత అవసరాల కోసం రూ.6 వేల కోట్లు సమకూర్చనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.నిధుల కొరతతో ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
RELATED ARTICLES

