Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుభూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఏకైక మార్గం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఏకైక మార్గం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

📰 Generate e-Paper Clip

తొలి దశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే
నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర భూసర్వే
వనపర్తి, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూసర్వే ఒక్కటే మార్గమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజల కోణంలో ఆలోచిస్తూ భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ,రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు:
భూ భారతి చట్టం ప్రకారం ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు,జియో కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్,ఎల్‌పీఎం నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.ధరణి కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ భూ భారతి పోర్టల్‌లో పేర్కొన్న విధంగా భూధార్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.భూ భారతి కింద తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు.రాష్ట్రంలో నక్షాలు అందుబాటులో లేని సుమారు 413 రెవెన్యూ గ్రామాలను కూడా దశలవారీగా సమగ్రంగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు.సర్వేను వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు, రోవర్లను పెద్ద ఎత్తున సమకూర్చుతున్నామని చెప్పారు.వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో సర్వేను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు రాజకీయ ప్రచారాలను పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములై రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని కోరారు.
సాదాబైనామాలు, హద్దుల వివాదాలకు పరిష్కారం:
సాదాబైనామాలు,భూ హద్దుల వివాదాలు,పాత రికార్డుల్లోని లోపాలు, అబాది ఆస్తుల వివరాలు వంటి సమస్యలకు సమగ్ర సర్వే ద్వారా పరిష్కారం చూపవచ్చని మంత్రి అన్నారు. గ్రామాల్లో ఇళ్ల స్థలాలు,నివాస ప్రాంతాలు,అబాది ఆస్తుల విస్తీర్ణం,హద్దులను సర్వే చేసి మ్యాపులతో సహా రికార్డుల్లో నమోదు చేస్తామని తెలిపారు.దశాబ్దాలుగా సాగులో ఉన్నప్పటికీ సరైన టైటిల్ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను గుర్తించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయాలకు తావులేదు:
పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ఇళ్లను కూడా లక్ష్యబద్ధంగా పూర్తి చేస్తామన్నారు.రెండో విడతలో నిర్మాణం ప్రారంభించే ఇళ్లలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల ఇళ్లకు కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.“ఊరు గుడిసె లేని రాష్ట్రం” చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.రెండో విడతలో అవకాశం లభించని అర్హులైన పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,మూడో,నాలుగో విడతల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.