Monday, October 12, 2026
prajasamkshemam news
Homeజాతీయంపిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం

📰 Generate e-Paper Clip

సైబర్ వేధింపులు, నేరాల నుంచి పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రతి గ్రామానికి న్యాయ సేవల కార్యక్రమాలు చేరేలా సహకారం
సైబర్ నేరాలకు 1930.. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 గుర్తుంచుకోవాలి: సీఎం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారి భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణకు సంబంధించిన వ్యవస్థలను మరింత బలోపేతం చేసి, ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
హైదరాబాద్‌లో జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం: ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. NALSA, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థలు న్యాయ సేవల ప్రాప్యతను విస్తరించేందుకు పనిచేస్తున్నాయి.
పిల్లల రక్షణకు బహుళ వ్యవస్థలు:
సదస్సులో సీఎం మాట్లాడుతూ మహిళలు, పిల్లల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్ది తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. TGSLSA పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తోందని వివరించారు.
తల్లిదండ్రులు అవగాహనతో అండగా నిలవాలి:
సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించడంలో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. పిల్లలను తప్పుబట్టకుండా, అవగాహనతో వారికి అండగా నిలిచి మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930, పిల్లల సహాయం కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు.“న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు.. బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, గౌరవాన్ని పునరుద్ధరించడం కూడా. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం” అని సీఎం పేర్కొన్నారు.ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు, సిఫారసులు దేశవ్యాప్తంగా పిల్లల రక్షణకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మొబైల్ లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం:
NALSA ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సిద్ధం చేసిన మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్, న్యాయమూర్తుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్, NALSA ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, TGSLSA ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ పి. సామ్ కోషి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అధికారిక వివరాల ప్రకారం జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్యాట్రన్-ఇన్-చీఫ్‌గా, జస్టిస్ పి. సామ్ కోషి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.