డిసెంబర్ 9న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి
38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగవంతం.. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధి చేకూర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు 38 బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కుట్టు మిషన్ల పంపిణీకి కార్యాచరణ:ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకానికి సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. డిసెంబర్ 9న కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టేలా టెండర్లు, ఇతర ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
గురుకులాలకు సొంత భవనాలు:
రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో 26 పాఠశాలలకే సొంత భవనాలు ఉన్నాయని సమీక్షలో వెల్లడైంది. మిగిలిన పాఠశాలలకు భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ, అనుమతులు, నిధుల మంజూరుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు నెలకు ఒక గురుకుల పాఠశాలను సందర్శించి, సమస్యల పరిష్కారానికి నివేదికలు సమర్పించాలని సూచించారు.బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపట్టి నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ అందించాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టి సారించాలని సూచించారు.
బీసీ వితంతువులు, ఒంటరి మహిళలకు నైపుణ్య శిక్షణ, రజకులకు ఆధునిక ధోబీఘాట్లు, కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ, నీరా కేఫ్‌లు, నందనవనాల అభివృద్ధిపై సమీక్షించారు. పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులకు ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు.సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కమిషనర్ బాలమాయాదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
RELATED ARTICLES

