Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుమియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

📰 Generate e-Paper Clip

రూ.50 వేల కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వ హక్కులకు స్పష్టత – తెలంగాణ ప్రజల విజయమన్న సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ – హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాల బారిన పడకుండా కాపాడుకునేందుకు అనుకూలంగా తీర్పు వెలువడటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూముల పరిరక్షణ:
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానాల్లో సమర్థవంతంగా న్యాయపోరాటం చేసి ఇప్పటివరకు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రధాన ప్రాంతాల్లో విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందన్నారు.ధరణి ముసుగులో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాల్లో బలమైన వాదనలతో అడ్డుకున్నామని వివరించారు.
ఏడు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ:
ప్రభుత్వం న్యాయపోరాటం ద్వారా కాపాడిన భూముల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు.
-కంచ గచ్చిబౌలి: 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపోరాటం ద్వారా కాపాడినట్లు తెలిపారు.
-మామిడిపల్లి: 450 ఎకరాల భూమిని పరిరక్షించినట్లు పేర్కొన్నారు.
-సాహెబ్‌నగర్ కలాన్: హయత్‌నగర్ మండలంలోని సర్వే నంబర్ 201లో 140 ఎకరాల భూమిని కాపాడినట్లు తెలిపారు.
-కొండాపూర్: శేరిలింగంపల్లి మండలం సర్వే నంబర్ 59లోని 36 ఎకరాలు, సుమారు రూ.3,600 కోట్ల విలువైన భూమిపై సెప్టెంబర్ 3, 2025న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.
* మంచిరేవుల: గండిపేట మండలం సర్వే నంబర్ 393లోని 143 ఎకరాల భూమిని పరిరక్షించామని, అందులో 50 ఎకరాలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కోసం కేటాయించినట్లు చెప్పారు.
* జయశంకర్ భూపాలపల్లి: సుమారు రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి కాపాడినట్లు తెలిపారు.
* భద్రాద్రి కొత్తగూడెం: ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించిన 600 ఎకరాల అటవీ భూమిని న్యాయస్థానాల్లో పోరాడి రక్షించినట్లు వివరించారు.
ప్రజా ప్రయోజనాలకే భూముల వినియోగం:
ప్రభుత్వం న్యాయపోరాటం చేసి సాధించుకున్న భూములను తిరిగి ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటవీ శాఖకు చెందిన భూములను ఆ శాఖకు, రెవెన్యూ శాఖకు చెందిన భూములను సంబంధిత శాఖకు అప్పగిస్తామని తెలిపారు.వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ భూముల విక్రయం, తద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తుందని చెప్పారు.దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి, నిరుపేదలకు నాణ్యమైన విద్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు తదితర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు.ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.