వినియోగదారుడితో మాట్లాడకుండానే మాట్లాడినట్లు హెచ్‌పీసీఎల్ అధికారులకు నివేదిక!
గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని బాధితుడి డిమాండ్
సదాశివపేట/సంగారెడ్డి,అక్టోబర్31(ప్రజాసంక్షేమం న్యూస్):గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో నిర్ణీత ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఓ వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై సరైన విచారణ జరగకుండానే పరిష్కరించినట్లు అధికారులు ఫిర్యాదును ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన హెచ్‌పీ గ్యాస్ వినియోగదారుడు ఖాజా మొయినుద్దీన్ సిలిండర్ రీఫిల్ డెలివరీ సమయంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ గ్రీవెన్స్ నంబర్ MPANG/E/2026/0057556 ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు.అయితే, సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వినియోగదారుడితో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు నివేదిక ఇవ్వడంతో హెచ్‌పీసీఎల్ హైదరాబాద్ ఎల్పీజీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదును ముగించినట్లు బాధితుడు తెలిపారు. తనతో ఏజెన్సీ నిర్వాహకులు వ్యక్తిగతంగా గానీ, ఫోన్ ద్వారా గానీ సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారమైనట్లు నివేదిక ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు తీసుకోవడం కాకుండా అధికారులు స్వయంగా వెల్టూర్ గ్రామానికి వచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న అదనపు వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని, వినియోగదారుడి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ సిలిండర్‌పై అదనపు వసూళ్ల ఫిర్యాదును పరిష్కరించకుండానే ముగించారా?
RELATED ARTICLES

