Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeజాతీయంనవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల నిరసనలు

నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల నిరసనలు

📰 Generate e-Paper Clip

ఎఫ్‌టీఏ ఒప్పందాలను రద్దు చేయాలి.. నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించాలి
పంటలన్నింటికీ సీ2+50 శాతం ప్రకారం చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలి
నల్గొండలో ప్రారంభమైన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు
నల్గొండ, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్):

రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు పిలుపునిచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) దోపిడీని అరికట్టాలని, ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని మహాసభలు డిమాండ్ చేశాయి.నల్గొండలో నవంబర్ 15 నుంచి 17 వరకు జరుగుతున్న 36వ ఏఐకేఎస్ జాతీయ మహాసభలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే ఎర్రజెండాను ఆవిష్కరించగా, రైతు కూలీ ఐక్యత నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. గత నాలుగేళ్లలో మరణించిన ప్రజా ఉద్యమ నాయకులు, అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.మహాసభల ప్రారంభానికి ముందు నల్గొండ పట్టణంలో భారీ రైతు ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు జె. రంగారెడ్డి ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేశారు.ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ ధావలే మాట్లాడుతూ, 1946–1951 మధ్య ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి నల్గొండ కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. నిజాం నిరంకుశ భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారని, 50 వేల మందికి పైగా ప్రజలు అణచివేతకు గురయ్యారని గుర్తుచేశారు. ఈ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాలకు పైగా భూమి పేదలకు, సాగుదారులకు పంపిణీ అయిందని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన 13 నెలల చారిత్రక రైతాంగ ఉద్యమంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు.
దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కోటి 58 లక్షల మంది సభ్యత్వం సాధించడం సంస్థకు గర్వకారణమని తెలిపారు. కార్పొరేట్ అనుకూల విధానాలు రైతులు, కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ గత నాలుగేళ్ల ఉద్యమాల నివేదికను ప్రవేశపెట్టారు. మతతత్వ శక్తుల విభజన రాజకీయాలను ఎదుర్కొనేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ట్రేడ్ యూనియన్ల మధ్య బలమైన ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు.సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎళమరం కరీం మాట్లాడుతూ రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత కోసం ఏఐకేఎస్ చేస్తున్న కృషిని అభినందించారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కార్మికుల భారీ ర్యాలీకి రైతు సంఘాలు మద్దతు తెలపాలని కోరారు.సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనియాడారు. పి. సుందరయ్య, ఎం. బసవపున్నయ్య, ఎం. స్వరాజ్యం, సి. రాజేశ్వరరావు వంటి నాయకుల సేవలను స్మరించుకున్నారు. రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.మహాసభల్లో రెండు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఒక తీర్మానం చేయగా, మరో తీర్మానంలో డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ సిఫార్సుల మేరకు సీ2 వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి పంటలన్నింటికీ చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ ద్వారా లభించే అదనపు విలువలో రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయమైన వాటా కల్పించాలని కోరారు.మహాసభల్లో ప్రవేశపెట్టిన ప్రధాన కార్యదర్శి నివేదికపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు నవంబర్ 17న కూడా కొనసాగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.