Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeక్రైమ్కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం-ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు:పోలీస్ కమిషనర్ బి. సుమతి

కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం-ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు:పోలీస్ కమిషనర్ బి. సుమతి

📰 Generate e-Paper Clip

మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి
కారం పొడిలో 30 శాతం రంపపు పొడి కలిపినట్లు గుర్తింపు
10.89 టన్నుల మసాలా పదార్థాలు స్వాధీనం — విలువ రూ.25 లక్షలు
ఇద్దరు అదుపులో — నకిలీ ప్యాకింగ్, లేబుళ్ల గుట్టురట్టు
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

ప్రజా సంక్షేమం న్యూస్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడే వారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు.
ఆహారం మనిషి జీవనాధారమని, అలాంటి ఆహారంలోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా సంపాదించాలనుకునే వారిపై చట్టం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.
పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై మెరుపుదాడి నిర్వహించాయి.
విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.వంటింట్లో రుచికి, ఆరోగ్యానికి ఆధారంగా ఉపయోగించే మసాలా దినుసులనే కల్తీ వ్యాపారానికి సాధనంగా మార్చిన తీరు తనిఖీల్లో వెలుగుచూసింది. ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం రంపపు పొడి (సా డస్ట్) కలిపినట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు. అంతేకాకుండా అసలు బ్రాండ్‌ను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా నమ్మించే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు.నాసిరకం ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ముసుగు తొడిగి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, వినియోగదారుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్‌లోకి పంపడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.ప్యాకెట్ అందంగా ఉందనో, దానిపై ప్రముఖ బ్రాండ్‌ను పోలిన పేరు ఉందనో ప్రజలు సహజంగా నమ్ముతారని, ఆ నమ్మకాన్నే అక్రమార్కులు తమ లాభాల కోసం వాడుకోవడం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలపై సమాచారం సేకరించి, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాడిలో భారీ మొత్తంలో మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను సీజ్ చేశారు. మొత్తంగా 10,890 కిలోలు, అంటే 10.89 టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా, వాటి అంచనా విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ, ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెస్ చేసిన పొడులు, ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను కూడా బృందాలు పరిశీలించాయి.ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును మెడిపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఆహార భద్రత, కల్తీ, మిస్‌బ్రాండింగ్‌తో పాటు ఆహార పదార్థాల అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి వర్తించే చట్ట నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.కల్తీ ఆహారం కంటికి కనిపించని ప్రమాదమని, అందువల్ల వినియోగదారుల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ బి. సుమతి పేర్కొన్నారు. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తదితర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ప్యాకెట్ రూపాన్ని లేదా బ్రాండ్ పేరును మాత్రమే చూసి కొనుగోలు చేయవద్దని సూచించారు.బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు లేదా బెస్ట్ బిఫోర్ తేదీ, బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు తదితర తప్పనిసరి సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని కోరారు. ప్యాకింగ్ సరిగా లేకపోయినా, లేబులింగ్‌పై అనుమానం వచ్చినా, నాణ్యత విషయంలో సందేహం కలిగినా అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, ప్యాకింగ్ లేదా అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని బి. సుమతి కోరారు.ఒక వినియోగదారుడి అప్రమత్తత అనేక కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై 8712662111 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్, మెడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు చేరే ఆహారం స్వచ్ఛంగా, సురక్షితంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ అక్రమ వ్యాపారాన్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని పోలీస్ కమిషనర్ బి. సుమతి మరోసారి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.