Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణగుంటిపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కూలీ మృతి

గుంటిపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కూలీ మృతి

📰 Generate e-Paper Clip

11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఉండటంతో ప్రమాదం
పురుగుమందు పిచికారీ చేస్తుండగా ఘటన
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికుల

ప్రజాసంక్షేమం న్యూస్ నిడమానూరు, సెప్టెంబర్ 27 (ప్రజాసంక్షేమం న్యూస్):

నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లగంతుల నాగరాజు (27) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.

రోజూవారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజూ పనుల కోసం తన స్వగ్రామమైన గుంటిపల్లికి వచ్చి కూలీ పనులు ముగించుకుని తిరిగి వెళ్లేవాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో గుంటిపల్లి పరిధిలోని ఓ రైతు పొలంలో పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అయితే పొలంలో అప్పటికే 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఉన్నట్లు సమాచారం. దీనిని గమనించకుండా నాగరాజు ఆ విద్యుత్ తీగపై కాలు వేయడంతో ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికందిన వయసులోనే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పొలంలో ప్రమాదకరంగా విద్యుత్ తీగ తెగిపడి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.