బాధిత గొర్రెల కాపరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: దయ్యాల నరసింహ
సుమారు 400 గొర్రెలు మృతి.. రూ.50 లక్షల మేర నష్టం
బీబీనగర్, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్:
బీబీనగర్ మండలం కొండమడుగు మెట్ సమీపంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన సుమారు 400 గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, బాధిత గొర్రెల కాపరి బాలబోయిన కిష్టయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు.బుధవారం బీబీనగర్‌లోని గొర్రెల మంద వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు గ్రామ పరిధిలోని అలీనగర్‌కు చెందిన బాలబోయిన కిష్టయ్య ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మేత కోసం మూడు, నాలుగు నెలల పాటు గొర్రెలను బీబీనగర్‌లోని నార్నె ఎస్టేట్ పరిసర ప్రాంతాలకు తీసుకువస్తారని తెలిపారు.మేత కాలం పూర్తయిన అనంతరం తిరిగి జూలూరుకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రైలు ప్రమాదంలో కిష్టయ్యకు చెందిన సుమారు 400 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు.గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్న కిష్టయ్య కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించడంతో పాటు మృతి చెందిన గొర్రెలకు ఇన్సూరెన్స్ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని దయ్యాల నరసింహ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుడమ శ్రీశైలం, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లంల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పాక జహంగీర్, బీబీనగర్ మండల కార్యదర్శి కడెం బీరప్ప, ఎర్రోళ్ల ఉపేందర్, బర్మ గణేష్‌తో పాటు గొర్రెల కాపరులు ఐలయ్య, బాలయ్య, నరసింహ, శేఖర్, బాల మల్లేష్, శ్రీశైలం, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి.
RELATED ARTICLES

