ప్రజా సంక్షేమం న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులు-2026కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన 123 మంది ఉపాధ్యాయులు,అధ్యాపకులను రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది.ఈ మేరకు విద్యాశాఖ గురువారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరాలను వెల్లడించింది.రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 5న ఎంపికైన అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు.పాఠశాల విద్య,ఇంటర్మీడియట్,సాంకేతిక విద్య, విశ్వవిద్యాలయాలు,అనుబంధ కళాశాలలకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.మొత్తం 123 మంది అవార్డు గ్రహీతల్లో అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ నుంచి 52 మంది ఉన్నారు.వీరితో పాటు యూనివర్సిటీల నుంచి 28 మంది,యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 29 మంది ఎంపికయ్యారు.ఇంటర్మీడియట్ విద్య విభాగం నుంచి 11 మంది,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన ముగ్గురు అధ్యాపకులు కూడా రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు.అనుబంధ కళాశాలల కేటగిరీలో ఒక ఫిజికల్ డైరెక్టర్,ఒక లైబ్రేరియన్ కూడా ఉన్నారు.పాఠశాల విద్య విభాగంలో ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.వివిధ జిల్లాల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం,విద్యా ప్రమాణాల పెంపు,పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం.ఉపాధ్యాయ అవార్డులతో పాటు విద్యా పరిపాలనలో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి ప్రత్యేక పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.టెక్నికల్ ఎడ్యుకేషన్,కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.శ్రీదేవసేనకు విద్యా పరిపాలనలో విశిష్ట సేవలకు అవార్డు లభించింది.సాంకేతిక, కాలేజియేట్ విద్య రంగాల్లో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరుగుదలలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఎంపిక చేశారు.అలాగే తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జి.రమేశ్‌ను అకడమిక్ లీడర్‌షిప్,పాఠశాల విద్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా విద్యా పరిపాలన అవార్డుకు ఎంపిక చేశారు.ఎంపికైన అవార్డు గ్రహీతలకు సెప్టెంబర్ 5న జరిగే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పురస్కారాలను అందజేయనున్నారు.అవార్డుల ప్రదానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య,సాంకేతిక విద్య,కాలేజియేట్ విద్య విభాగాల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

