నకిలీ రసీదుల నుంచి ఫేక్ డెత్ సర్టిఫికెట్ల వరకు.. వరుసగా వెలుగులోకి అక్రమాలు!
పని చేయకుండానే వేతనాలు పొందుతున్న 17 మంది.. తెరవెనుక ఎవరున్నారు?
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 59 జీవో కింద అక్రమ రిజిస్ట్రేషన్లకు నకిలీ రసీదులు సమర్పించిన వ్యవహారం నుంచి, కారుణ్య నియామకాల కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన ఆరోపణల వరకు మున్సిపల్ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.ఇటీవల కారుణ్య నియామకం కోసం నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వ్యవహారంలో మున్సిపల్ సిబ్బంది, అధికారుల పాత్రపై విచారణ సాగుతూ అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్‌లో విధులు నిర్వహించకుండానే 17 మంది వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వేతనాలు పొందుతున్న వారిలో కొందరు స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉన్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవాలేమిటో అధికారులు తేల్చాల్సి ఉంది.
59 జీవో అక్రమాలపై చర్యలేవి?
గతంలో 59 జీవో కింద జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొందరు నకిలీ ఇంటి నంబర్లతో కూడిన రసీదులను సమర్పించినట్లు జిల్లా ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. ఆ రసీదులు నకిలీవని తేలినప్పటికీ వాటిని ఎవరు సృష్టించారు? ఎవరు జారీ చేశారు? వాటి ఆధారంగా ఇంకా ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.నకిలీ రసీదుల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఆ దిశగా అధికారులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా?
ఏళ్ల తరబడి ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. కీలక అధికారుల పర్యవేక్షణలోనే ఈ అక్రమాలు జరిగాయా? లేక కొందరు సిబ్బంది స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారా? అన్న కోణంలోనూ విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ప్రజాధనం దుర్వినియోగమవుతోందా?
విధులకు హాజరుకాకుండా వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, హాజరు రికార్డులు, వేతనాల చెల్లింపులు, నియామక పత్రాలను పరిశీలించాలి. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రసీదుల వ్యవహారంలో బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ యంత్రాంగం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశిస్తారా? మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నాయనే ఆరోపణలకు తెరదించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? లేక ఈ వ్యవహారాలు కూడా మరుగున పడిపోతాయా? అన్నది వేచి చూడాలి.

