Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeజాతీయంఅఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

📰 Generate e-Paper Clip

నవంబర్ 15న నల్లగొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ
మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్**
అక్టోబర్ 31, ప్రజా సంక్షేమం న్యూస్:

అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండల పరిధిలోని పర్లెల్ల గ్రామంలో మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ అయిన నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు నిర్వహించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. నవంబర్ 15న 15 వేల మంది ఎర్రచొక్కా రైతు వాలంటీర్లతో భారీ కవాతు నిర్వహించడంతో పాటు లక్ష మంది రైతులతో మహా ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే మహాసభల్లో దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతాంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగంపై చూపే ప్రభావం, కౌలు రైతుల సమస్యలపై విస్తృత చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.1936లో ఏర్పాటైన అఖిల భారత కిసాన్ సభ జాతీయోద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి ఘనమైన చరిత్రను సృష్టించిందని గుర్తుచేశారు. 1946లో తెలంగాణలో ‘దున్నేవానికే భూమి కావాలి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి’ అనే నినాదాలతో సాగిన చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ, రైతు వ్యతిరేక మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, విదేశీ దిగుమతులపై సున్నా శాతం పన్ను విధానానికి వ్యతిరేకంగా 440 రైతు సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించిన ఘనత ఏఐకేఎస్‌కు ఉందన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 2,94,000 మంది పట్టాదారు పాస్‌బుక్కులు కలిగిన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి, తాగునీటి సమస్యలపై గతంలో అనేక ఉద్యమాలు నిర్వహించినట్లు చెప్పారు.రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ జాతీయ మహాసభలకు రైతులు, ప్రజలు, శ్రేయోభిలాషులు సంపూర్ణ సహకారం అందించి విజయవంతం చేయాలని బాలరాజు గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షుడు వి. గోపాల్ రెడ్డి, అధ్యక్షుడు నాయిని కృష్ణారెడ్డి, కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి మల్లెల శ్రీశైలం, రేసు యాదిరెడ్డి, వృత్తి సంఘాల మండల కన్వీనర్లు వేముల బిక్షం, సోలిపురం వెంకటరెడ్డి, మంగా జానయ్య, నోముల నర్సయ్య, బొలుగుల గోపాలు, నాయిని రోసిరెడ్డి, వంగపల్లి నర్సయ్య, అంబోజు దశరథ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.