Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeజాతీయంఏఐకేఎస్ జాతీయ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు!

ఏఐకేఎస్ జాతీయ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు!

📰 Generate e-Paper Clip

రైతులు, ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారనే విశ్వాసం పెరిగింది..
మీడియా,వాలంటీర్లు,ప్రజలు,అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన జూలకంటి రంగారెడ్డి.
ప్రజాసంక్షేమం న్యూస్|నల్లగొండ|నవంబర్ 21:
నల్లగొండలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని, ఈ విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతులు, ప్రజలు తమ వెంట బలంగా ఉన్నారనే విశ్వాసం పెరిగిందని, భవిష్యత్తులో రైతాంగ, ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. మహాసభల విజయానికి సహకరించిన ప్రజలు, మీడియా ప్రతినిధులు, వాలంటీర్లు, అధికారులు, వివిధ సంఘాలు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటాం:జూలకంటి
నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని జూలకంటి రంగారెడ్డి అన్నారు. తొలినాళ్లలో సభల నిర్వహణకు అవసరమైన వసతులు, ఆర్థిక వనరులు సమకూర్చడం, లక్షలాది మందిని సమీకరించడం వంటి అంశాలపై అనేక సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అయితే రైతులు, ప్రజలు, వివిధ వర్గాల సహకారంతో అన్ని సవాళ్లను అధిగమించి మహాసభలను ఘనంగా నిర్వహించామని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, మధ్యతరగతి, సంపన్న వర్గాలు రైతుల సభగా భావించి సహకరించారని పేర్కొన్నారు. ఫంక్షన్ హాళ్లు, లాడ్జీల నిర్వాహకులు సరసమైన ధరలకు వసతులు కల్పించారని, వైద్యులు సేవలందించారని, మున్సిపల్ యంత్రాంగం, అగ్నిమాపక శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు సహకరించాయని తెలిపారు. మహాసభల ప్రారంభోత్సవంలో కలెక్టర్, మేయర్ పాల్గొనడం, అధికార యంత్రాంగం అందించిన సహకారం అభినందనీయమన్నారు. అన్ని అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు నిర్వహించామని స్పష్టం చేశారు.రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనడం గత పోరాటాల చరిత్రను గుర్తుచేసిందని, ఈ మహాసభలతో రైతుల్లో చైతన్యం, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని అన్నారు. భవిష్యత్తులో రైతాంగ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడితే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారనే నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు.
రైతాంగ సమస్యలపై 15 తీర్మానాలు.. దేశవ్యాప్త పోరాటాలు:ముదిరెడ్డి
మహాసభల ప్రచారాన్ని వంద రోజుల పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ర్యాలీ, బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశం, అగ్రిషో, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అంచనాలకు మించి విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. సుమారు రెండు లక్షల రైతు కుటుంబాలు మహాసభకు సహకరించగా, నల్లగొండ జిల్లాలోనే లక్ష రైతు కుటుంబాలు భాగస్వాములయ్యాయని వివరించారు.125 స్టాళ్లతో నిర్వహించిన అగ్రిషో ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, శాస్త్రీయ సాగు పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, నీటి వినియోగం, విద్యుత్ తదితర అంశాలపై వేలాది మంది రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఫొటో ఎగ్జిబిషన్, కార్టూన్లు, కళాకారుల ప్రదర్శనలు, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాటకం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో 15 తీర్మానాలు ఆమోదించామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే సమగ్ర చట్టం, పంట నష్టపరిహారం, పంటల బీమా, కల్తీలేని విత్తనాలు, ఎరువుల సరఫరా, రుణాలు, మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ నిపుణుల నివేదికల అమలు వంటి అంశాలు తీర్మానాల్లో ఉన్నాయని వివరించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ రైతాంగాన్ని విస్మరిస్తున్న పాలక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.50 వేల కోట్ల సహాయ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కృష్ణా జలాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదని, సీడబ్ల్యూసీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలని అన్నారు.ప్రజల ఆరోగ్యాలు, పంటలు, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మహాసభల నిర్వహణలో 600 మంది వాలంటీర్లు, వంద రోజులుగా శ్రమించిన రైతు సంఘం, ప్రజా సంఘాల కార్యకర్తల కృషి మరువలేనిదని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రైతు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఉధృతం:తుమ్మల వీరారెడ్డి
రాబోయే రోజుల్లో ప్రజలపై భారాలు మోపే విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. జిల్లాలో పోడు భూములు, విద్య, మౌలిక వసతులు తదితర ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గత రుణాలను మాఫీ చేయడంతోపాటు కొత్త రుణాలు అందించాలని, వడ్డీ మాఫీ చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని అన్నారు.మహాసభల విజయంతో రైతాంగంలో వచ్చిన చైతన్యాన్ని భవిష్యత్తు ఉద్యమాలకు ఉపయోగించుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. మహాసభలకు సహకరించిన మీడియా ప్రతినిధులు, వాలంటీర్లు, అధికారులు, ప్రజలు, ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, బండ శ్రీశైలం, ఎండీ హాశం, పాలడుగు ప్రభావతి, ఎండీ సలీం, దండంపెల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.