Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుకోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ బీమాపై సీఎం కీలక ఆదేశాలు

కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ బీమాపై సీఎం కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలి – పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం బీమా భద్రత పొందుతున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా కొత్త పథకంలో లబ్ధి కల్పించాలని ఆదేశించారు.ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా జీవిత బీమా కింద రూ.2 లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షల వరకు ప్రయోజనాలు అందుతున్నాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రస్తుతం అందుతున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూనే, జీవిత బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేద కుటుంబాలకు ఈ పథకం భరోసాగా నిలవాలని ఆకాంక్షించారు.
అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర:రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంపిణీకి అవసరమైన చీరలను వెంటనే అన్ని జిల్లాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. బీమా పథకంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని, దరఖాస్తులను గ్రామాల్లోనే అందుబాటులో ఉంచాలని సూచించారు. అర్హులైన ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.