Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణధర్మారెడ్డి పల్లి కాల్వలో తూములు ఏర్పాటు చేసి ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి!

ధర్మారెడ్డి పల్లి కాల్వలో తూములు ఏర్పాటు చేసి ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి!

📰 Generate e-Paper Clip

రామన్నపేట చెరువులకు సాగు, తాగునీరు అందించాలని ప్రజలు,రైతుల విజ్ఞప్తి
ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:
ధర్మారెడ్డి పల్లి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రామన్నపేట పట్టణ ప్రజలు, రైతుల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాల్వలో తూములు ఏర్పాటు చేసి ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.రామన్నపేట పట్టణంలోని వెంకటరామయ్య చిన్న చెరువును నింపేందుకు రైల్వే స్టేషన్ సమీపంలోని ధర్మారెడ్డి పల్లి కాల్వకు తూము ఏర్పాటు చేసి, ఎర్రగుంట, లోతుకుంట, చాకరికుంట మీదుగా ఫీడర్ ఛానల్ నిర్మించాలని కోరుతున్నారు. అదేవిధంగా కొమ్మాయిగూడెం రోడ్డులోని కాటమయ్య దేవాలయం సమీపంలో మరో తూము ఏర్పాటు చేసి, పొలాల మీదుగా వెంకటరామయ్య చెరువుకు నీటిని మళ్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ రెండు ఫీడర్ ఛానళ్ల నిర్మాణంతో చెరువులు, కుంటలు నీటితో నిండటమే కాకుండా పరిసర వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలమట్టాలు పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.మునిపంపుల చెరువుకు ఆసిఫ్ నహర్ కాల్వ నుంచి దుబ్బాక గ్రామం మధ్యలో, గ్రామం వెలుపల, మునిపంపుల గ్రామం మధ్య నుంచి మూడు కాలువల ద్వారా నీరు చేరే విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, రామన్నపేట ప్రాంతంలోనూ నీటి మళ్లింపునకు అనువైన కాలువలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.ధర్మారెడ్డి పల్లి కాల్వ నిర్మాణం జరుగుతున్నప్పటికీ, అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూములు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల్లో శాశ్వత గైడ్‌వాల్స్ నిర్మిస్తున్నారని, దీంతో భవిష్యత్తులో నీటిని చెరువులకు మళ్లించే అవకాశాలు దెబ్బతినకుండా అధికారులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు.ఫీడర్ ఛానళ్ల నిర్మాణం చేపడితే ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ముంపు సమస్యతో పాటు ఇతర స్థానిక సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రైతులు, ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మాది గొంతెమ్మ కోరిక కాదు.. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న విజ్ఞప్తి మాత్రమే” అని రామన్నపేట ప్రజలు, రైతులు స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.