– విజిలెన్స్ బృందాలతో నిరంతర తనిఖీలు,ఆకస్మిక దాడులు
– ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం
– ఖనిజ వనరులతో రాష్ట్ర ఆదాయం పెంచేలా చర్యలు
ప్రజాసంక్షేమం న్యూస్|హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.సోమవారం సచివాలయంలో గనులు,భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని,విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక దాడులు చేపట్టి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ,ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని,ఖనిజ వనరుల సమర్థ వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డీజీ విజిలెన్స్ డి.ఎస్.చౌహాన్, డైరెక్టర్ మైన్స్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

