Thursday, October 15, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుకురుమూర్తిలో ఎండిపోతున్న పంట పొలాల పరిశీలన

కురుమూర్తిలో ఎండిపోతున్న పంట పొలాల పరిశీలన

📰 Generate e-Paper Clip

సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు
దాదాపు 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని రైతుల ఆవేదన
రైతులను వెంటనే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్గొండ జిల్లా, కట్టంగూర్:
మండలంలోని కురుమూర్తి గ్రామంలో సాగునీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఎండిపోతున్న పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు: చిరుమర్తి
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సరైన సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కురుమూర్తి గ్రామంలో దాదాపు 100 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
4 నుంచి 5 గంటలే విద్యుత్‌ సరఫరా:రోజుకు కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని, కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు చిరుమర్తి లింగయ్య తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా మోటార్ల స్టార్టర్లు కాలిపోతున్నాయని, తగినంత నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వివరించినట్లు పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేదని రైతులు గుర్తుచేస్తున్నారని అన్నారు. తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు వాపోతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా రైతులు అల్లి లింగయ్య, చంద్రకళతో పాటు పలువురు రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని, సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ ఎమ్మెల్యేకు వివరించారు.
రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి:ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు అవసరమైన సాగునీటిని నిరంతరాయంగా అందించాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.